
నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ చేపట్టారు
సినిమాటోగ్రఫీ: ఏడురోలు రాజు
ఎడిటింగ్: అన్వర్ అలీ
సంగీతం: అనుదీప్ దేవ్
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్
బ్యానర్స్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
సమర్పణ: జీ స్టూడియోస్
రచన, దర్శకత్వం: మానసశర్మ
విడుదల తేదీ: 03.04.2026
సినిమా నిడివి: 133 నిమిషాలు
ఒక సినిమాను నిర్మించడం కంటే దాన్ని ప్రమోషన్స్ ద్వారా జనంలోకి తీసుకెళ్లడమే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్. సినిమా ఎలా ఉన్నా, దానికి హైప్ తీసుకొచ్చి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే స్ట్రాటజీ. దాన్నే ఫాలో అయింది ‘రాకాస’ చిత్ర యూనిట్. అన్ని మాధ్యమాల్లో సినిమా గురించి ప్రమోట్ చేసి ఏప్రిల్ 3న ‘రాకాస’ థియేటర్లలోకి తీసుకొచ్చారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగీత్ శోభన్ హీరోగా లేడీ డైరెక్టర్ మానసశర్మ రూపొందించిన ఈ సినిమాకి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. హారర్ కామెడీగా ప్రమోషన్స్‌లో ప్రొజెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది అనేది తెలుసుకుందాం.
కథ:
ఇది 1000 క్రితం మొదలైన కథ. రాజుల కాలం నుంచి ఆ ఊరి చివర కోటలో ఉన్న భీకర బ్రహ్మరాక్షసుడికి నరబలి ఇవ్వటం అనేది ఆచారంగా వస్తూ ఉంటుంది. కోటలో ఉన్న రాక్షసుడి నుంచి హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఓ నిండు ప్రాణాన్ని బలిగా పంపిస్తారు. బలి ఇవ్వకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుందనే మూడనమ్మకంతో హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి బలి అర్పిస్తుంటారు. ఆ కోటలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడనే భయంతో ఎవరూ ఆ కోట వైపు వెళ్లరు. వెయ్యేళ్ల తరువాత 2026లో ఆ ఊరివాడైన వీరబాబు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి వస్తాడు.
రకరకాల మలుపుల తర్వాత రాక్షసుడికి బలిగా వెళ్లేందుకు సిద్ధపడతాడు వీరబాబు. కోటలోకి వెళ్లిన వీరబాబు బయటికి వచ్చే అవకాశం ఉండదు. అదే కోటలో వెన్నెల కిషోర్ కొన్నిరోజులుగా ఉంటాడు. వీరబాబును వెతుక్కుంటూ హీరోయిన్, గెటప్ శ్రీను కూడా కోటలోకి వెళతారు. కానీ, బయటికి వచ్చే అవకాశం లేదు. రాక్షసుడ్ని చంపితేనే అక్కడి నుంచి వారంతా బయట పడగలరు. మరి వీరబాబు ఏం చేశాడు? చివరికి రాక్షసుడు హతమయ్యాడా? వీరబాబు బృందం బయటపడిందా.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఓపెనింగ్ సీన్ చూస్తే సినిమాలో చాలా పెద్ద స్టఫ్ ఉంది. 1000 ఏళ్ళ క్రితం కథతో మొదలై 2026లో హీరో ఎంటర్ అయిన పంచ్ డైలాగులతో కూడిన కామెడీ సినిమాగా మారిపోతుంది. అయితే ఇది హారర్ కామెడీ సినిమా అని గుర్తు చెయ్యడానికి అన్నట్టుగా కోట, రాక్షసుడికి సంబంధించిన ఏదో ఒక మధ్య మధ్య చూపిస్తారు. ఏదో చందమామ కథని చూస్తున్న ఫీల్ కలిగించి, వీరబాబులోని ఫన్ ఎలిమెంట్స్‌ని వాడుకుంటూ కథని బాగా నడిపించారు దర్శకురాలు మానస. ఇలాంటి హారర్, సోషియో ఫ్యాంటసీ సినిమాలు థియేటర్లలో కూర్చున్నంత సేపు బాగానే ఉంటాయి. కానీ, బయటికి వస్తే సినిమాలో ఏం ఉంది అనే ఆలోచన వస్తుంది.
‘రాకాస’ విషయంలో కూడా ప్రేక్షకులు అలాగే ఫీల్ అవుతారు. కథలో, కథనంలో ఎన్నో లోపాలు సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా నడపడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సంగీత్ శోభన్, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ చాలా చోట్ల నవ్వించింది. ఎంతో బిల్డప్‌తో స్టార్ట్ అయిన సినిమా ఆ తర్వాత కామెడీ వైపు టర్న్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా సోసోగా నడుస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథలోకి వెళ్లినట్టే మళ్లీ కామెడీ వైపు వచ్చేస్తుంది. ఇక క్లైమాక్స్‌లో అయినా మెరుపులు మెరిపిస్తారా అంటే ఎలాంటి పసలేని ముగింపు ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది.
నటీనటులు:
సినిమాకి మెయిన్ ఎస్సెట్‌గా హీరో సంగీత్ శోభన్‌ని చెప్పుకోవాలి. చక్కని టైమింగ్‌లో పంచ్ డైలాగులు కొడుతూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. అతనికితోడు గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ కూడా బాగుంది. హీరోయిన్ నయన్ సారిక తన లుక్‌తో, అవసరమైన చోట పెర్‌ఫార్మ్ చేస్తూ ఆకట్టుకుంది. తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ వంటి నటులు తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
నిపుణులు సాంకేతిక:
టెక్నికల్‌గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఎడురోలు రాజు సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్‌గా బాగానే ఉంది. సినిమా నిడివి 2 గంటల 13 నిమిషాలు ఉండటం విశేషం. అనుదీప్ దేవ్ సంగీతం ఫర్వాలేదు అనిపించింది. ఇక గ్రాఫిక్స్ విషయంలో కూడా మంచి కేర్ తీసుకున్నట్టు కనిపించింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌ను బాగా డిజైన్ చేసుకున్నారు. డైరెక్టర్ మానసశర్మ గురించి చెప్పాలంటే.. కాస్త క్లిష్టంగా ఉన్న సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అక్కడక్కడా కనిపించే కొన్ని మైన్స్‌లు తప్ప డైరెక్టర్‌గా ఓకే అనిపించుకున్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పాల్సి వస్తే.. ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైన మేరకు రాజీ పడకుండా సినిమాను నిర్మించారని ఔట్‌పుట్ చూస్తే అర్థమవుతుంది. ఈ విషయంలో నిర్మాత నిహారిక కొణిదెలను అప్రిషియేట్ చేయాలి.
ప్లస్ పాయింట్స్:
సంగీత్ శోభన్ పెర్ఫార్మెన్స్
పంచ్ డైలాగ్స్
కొంత వరకు గ్రాఫిక్స్
పిల్లల్ని ఆకట్టుకునే అంశాలు
ప్రమోషనల్ సాంగ్
మైనస్ పాయింట్లు:
కథ, కథనాల్లో బలం లేకపోవడం
ప్రధాన ఇతివ త్తంలోనే లోపాలు
ఆకట్టుకోని క్లయిమాక్స్
ల్యాగ్ ఉన్న సీన్స్
ఫైనల్‌గా చెప్పాలంటే..
టైటిల్ చూసి ఇదేదో భారీ హారర్ మూవీ అని వెళ్లేవారికి నిరాశ తప్పదు. అయితే, లోపలికి వెళ్లిన తర్వాత మంచి ఎంటర్టైన్, ఆకట్టుకునే కొన్ని అంశాలతో థియేటర్లలో ప్రేక్షకులు సంతృప్తి చెందారు. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే ప్రమోషనల్ సాంగ్ కూడా బాగుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉండే అవకాశం ఉందనే హింట్‌ని కూడా చివర్లో ఇచ్చారు.
రేటింగ్: 2.25/5
– జి.హరా
నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు/అభిప్రాయాలు రచయిత పంచుకున్న వ్యక్తిగత అభిప్రాయాలు/అభిప్రాయాలు మరియు సంస్థ వాటికి బాధ్యత వహించదు. వీక్షకుల విచక్షణతో వారికి ప్రతిస్పందించే ముందు సలహా ఇవ్వబడుతుంది.

C.E.O
Cell – 9866017966
