
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ముఖ్యమంత్రి దంపతులు, మంత్రి లోకేశ్, దేవాన్ష్ తిరుమలలోని అన్నదాన సత్రంలో భక్తులకు స్వయంగా వడ్డించి ప్రత్యేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం కుటుంబం ఆలయం నుంచి బయటకు వచ్చి, మాడ వీధుల గుండ కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనానికి చేరుకుంది. ఈ విధంగా దారిపొడవునా వేచి ఉన్న భక్తులకు చంద్రబాబు అభివాదం చేశారు. సాధారణంగా ఉండే కట్టుదిట్టమైన భద్రతను వద్దు మరీ ఆయన నేరుగా సామాన్య భక్తుల వద్దకు వెళ్లారు.
ముఖ్యమంత్రి తన మనవడు దేవాన్ష్‌తో కలిసి భక్తులతో కరచాలనం చేశారు. తమ అభిమాన నాయకుడిని దగ్గరగా చూసిన భక్తులు ఉత్సాహంగా ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇదే సమయంలో దేవాన్ష్‌కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు కూడా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు.
అన్నదాన సత్రానికి చేరుకున్న చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంప్రదాయబద్ధంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఒక సామాన్య సేవకుడిలా ముఖ్యమంత్రి స్వయంగా వడ్డించారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజున నారా కుటుంబం తిరుమల అన్నదాన ట్రస్టుకు విరాళం ఇవ్వడమే కాకుండా, ఇలా సేవలో పాల్గొనడం ఒక ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో తిరుమల పవిత్రతను కాపాడటంతో పాటు, సామాన్య భక్తులకు మరింత మెరుగైన దర్శన భాగ్యం కల్పించేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.

C.E.O
Cell – 9866017966




