

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి కీలక పాత్రలో నటించారు. ప్రముఖ ఓటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందంటే..?
కథ:
విక్రమ్ వాసు (నిఖిల్) ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్. కొన్ని కారణాల వల్ల అతను సస్పెన్షన్ లో ఉంటాడు. అయితే కేసారం గ్రామంలో శిరీష అనే యువతి దారుణ హత్యకు గురైంది. ఈ కేసును ఛేదించడానికి కమిషనర్ మనోజ్ కుమార్ (సమీర్) మళ్ళీ విక్రమ్‌ను రంగంలోకి దించుతాడు. యూనిఫామ్ లేకుండానే ఒక స్పెషల్ టీమ్‌తో విక్రమ్ ఈ కేసు విచారణను చేపడతారు. ఈ కోసం విక్రమ్ కి ఎదురైనా సవాళ్లు ఏంటి? అతని వెంటాడుతున్న గతమేంటి? అసలు విక్రమ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? శిరీష హత్యకు కారకులు ఎవరు? వంటి విషయాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
కేసారం గ్రామంలో జరిగిన శిరీష అనే యువతి హత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సస్పెన్షన్‌లో ఉన్న విక్రమ్‌కు కమిషనర్ ఈ కేసును అప్పగించడం, ఆ తర్వాత జరిగే మలుపులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ సాగే తీరు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. ముఖ్యంగా శిరీష హత్య కేసును ఛేదించేలా వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి.
కొన్ని ఎపిసోడ్లలో కథ చాలా నెమ్మదిగా సాగింది. అనవసరమైన సీన్లు ఉండటం వల్ల ఆడియన్స్‌కు కాస్త బోర్ కొట్టే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అయితే ట్విస్ట్‌లు, నిఖిల్ పర్ఫార్మెన్స్ మాత్రం సిరీస్‌ను నిలబెట్టాయి.
దర్శకుడు వేదవ్యాస్ ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో మిస్టరీని విప్పుతూ థ్రిల్లర్ ప్రియులకు నచ్చేలా సిరీస్ నడిపించాడు. ముఖ్యంగా నిఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. అషు రెడ్డి తన గ్లామర్, యాక్టింగ్‌తో సిరీస్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఈ సిరీస్‌లో నిఖిల్ ‘విక్రమ్ వాసు’ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. నిబంధనలను పక్కనపెట్టి, తనదైన శైలిలో కేసులను ఛేదించే ఒక అన్‌కన్వెన్షనల్ కాప్‌గా నిఖిల్ నటన ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్‌గా అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ బాగా ఉన్నాయి. అషు రెడ్డి పాత్రలో సస్పెన్స్ ఉండటమే కాకుండా, ఆమె నటన కూడా సిరీస్‌కు ప్లస్ అయ్యింది. సమీర్, గాయత్రి చాగంటి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సుహాస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్స్, సస్పెన్స్ సీన్లలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పరవాలేదు. డైలాగ్స్ మరింత పవర్ ఫుల్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ పరిమితులు, సిరీస్‌ను క్వాలిటీగా నిర్మించారు. విజువల్స్, లోకేషన్స్ సహజంగా ఉన్నాయి.
ప్రస్తుతం 8 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటిదాకా అయితే కథాకథనాల్లో పెద్దగా మెరుపుల్లేవు. రాబోయే ఎపిసోడ్స్ లో హీరోకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలా ఉంటుందనే ఆసక్తి మాత్రం కలుగుతోంది.
ప్లస్ పాయింట్లు:
– నిఖిల్ పర్ఫార్మెన్స్
– సస్పెన్స్
– నేపథ్య సంగీతం
– నిర్మాణ విలువలు
– అషు రెడ్డి నటన
మైనస్ పాయింట్లు:
– నెమ్మదిగా సాగే కథనం
– డైలాగ్స్
ఫైనల్ గా…
కొన్ని చోట్ల సాగతీత సీన్లు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చే అవకాశం ఉంది.
నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.

C.E.O
Cell – 9866017966
