
హనుమకొండ జిల్లా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలహై భారీ అవకతవకలు బయటపడ్డాయి. గురువారం (ఏప్రిల్ 2) నిర్వహించిన ఈ దాడుల్లో అనధికార డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ పటిష్టంగా నడుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తనిఖీల సమయంలో 20 మంది అనధికారిక ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు పనిచేస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అధికారిక లెక్కల్లో చూపని రూ.47,450లు నగదుతో పాటు జత చేయని 70 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్‌ల ఆధీనంలో 204 అందజేయని రిజిస్టర్డ్ పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు.
డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్‌లను పరిశీలించగా గత ఏడాది కాలంలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి సుమారు రూ.42.03 లక్షల రూపాయలను ఫోన్‌పే ద్వారా లావా దేవీలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఎస్‌ఆర్‌ఓ-1 జమలాపురం రామనరసింహారావు, ఎస్‌ఆర్‌ఓ-2 దావులూరి ఆనంద్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ల ద్వారా కీలక ఆధారాలు బయటపడ్డాయి. అనధికారిక డాక్యుమెంట్ రైటర్లు ఇచ్చిన పత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
కార్యాలయ తనిఖీలతో పాటు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్‌ల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఎస్‌ఆర్‌ఓ-2 దావులూరి ఆనంద్ నివాసంలో రూ.24.61 లక్షల నగదు, 819.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి ఆభరణాలు, కపిల్ చిట్స్‌లో రూ.30.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా పలు ఆస్తి పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ప్రభుత్వం నివేదికను సమర్పించి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

C.E.O
Cell – 9866017966

