[ad_1]
తెలంగాణ గడ్డపై సాహిత్య పరిమళాలు దేశవ్యాప్తంగా మరోసారి గుబాళించాయి. ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన అనిమేష అనే కవిత సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. దేశ వ్యాప్తంగా మొత్తం 24 భారతీయ భాషల్లో ఎంపిక చేసిన ఉత్తమ రచనలలో తెలుగు భాషలో నందిని సిధారెడ్డికి ఈ అవార్డు లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉత్తేజపరిచే రచనలు చేసిన నందిని సిధారెడ్డి, ఈసారి సామాజిక సంక్షోభాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. అనిమేష కవిత సంపుటి ప్రధానంగా కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్ని, ఆ సమయంలో సామాన్యుడు అనుభవించిన నరకయాతనను ప్రతిబింబిస్తుంది. లాక్ డౌన్ నాటి ఏకాంతం, మరణభయం, విడిపోయిన బంధాలను ఆయన తన కవిత్వంలో హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు.
నందిని సిధారెడ్డి ప్రస్థానం కవిత్వానికీ, సాహిత్యానికే పరిమితం కాలేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఆయన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సిధారెడ్డి గీతాలు గతంలో అనేక ప్రజాపోరాటాలకు ఊపిరి పోశాయి.
ప్రస్తుతం ఆయనకు దక్కిన ఈ గౌరవంపై తెలుగు సాహితీ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తోంది. కాల్ వంటి విపత్కర పరిస్థితులను మానవీయ కోణంలో అక్షరీకరించడం వల్లే ఈ అవార్డు దక్కింది. సిధారెడ్డి సరళతరమైన శైలి, మనసును హత్తుకునే భావ వ్యక్తీకరణ ఆయనను పాఠకులకు, ప్రజలకు చేరువ చేశాయి. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు, కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
[ad_2]