**ప్రజలకు మన సంతోషాన్ని పంచాలి, వారిపై మన అసంతృప్తి ప్రదర్శించొద్దు
**బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహణ
*జననేత్రం న్యూస్ ఉమ్మడిఖమ్మం బ్యూరో జూన్17*//: రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమ అంశాలలో ఖమ్మం జిల్లా కొనసాగిస్తున్న విజయగాధను కొనసాగించాలని బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్రంలో నిర్వహించిన ఐఎఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ సంచాలకులుగా బదిలీపై వెళ్తున కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని జిల్లా అధికారుల బృందం నిర్వహించారు.
కలెక్టరేట్ కు చేరుకున్న ముజమ్మిల్ ఖాన్ కు గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్.సి.సి. కెడేట్స్, ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రగతిని ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ముజమ్మిల్ ఖాన్ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారని, స్నేహపూర్వక వాతావరణంలో అధికారులంతా మంచి బృందంగా ఏర్పడి ప్రజా సమస్యలు పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేసేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారని అధికారులు వెల్లడించారు.
అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి, రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా అధికారులు, పలువురు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో తమకు ఉన్న అనుభవాలను తెలియజేశారు.
*అందరి సహకారంతో జిల్లా అభివృద్ది:*
ఈ సందర్భంగా బదిలీ పై పౌరసరఫరాల శాఖ సంచాలకులుగా వెళ్తున్న *ఖమ్మం జిల్లా కలెక్టర్ గా తన ప్రస్థానాన్ని ముజమ్మిల్ ఖాన్ వివరించారు.* ఖమ్మం నేల చాలా పవిత్రమైందని, ఇక్కడ పని చేయడంలో చాలా సంతృప్తి లభిస్తుందని, వరదల సమయంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది అద్భుతంగా పని చేశారని అన్నారు. ప్రజలకు నేరుగా క్షేత్రస్థాయిలో ఇంటారాక్ట్ అవుతూ వారి సమస్యలు పరిష్కరించేందుకు తనకు అవకాశం లభించిన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
హుస్నాబాద్ లో సబ్ కలెక్టర్ గా మొదటిసారి విధులకు చేరిన కొత్తలో ఒక ముసలావిడ తన దగ్గర వచ్చి దరఖాస్తు ఇచ్చి సమస్య పరిష్కారం చేయాలని కోరిందని, తాను ఇటీవలే చేరానని తన పరిధిలో రాదని చెప్పినా కలెక్టర్ కాబట్టి పరిష్కరించాలని ఆ ముసలమ్మ అడిగినప్పుడు ప్రజలకు వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకం మొదటిసారి గమనించానని అన్నారు.
కలెక్టరేట్ వ్యవస్థ 250 సంవత్సరాల నుండి ఉందని, మనకు వ్యక్తిగతంగా ఎటువంటి గౌరవం, గుర్తింపు ఉండదని, వ్యవస్థకు ఆ గౌరవం లభిస్తుందని అన్నారు. మనం ఉన్నా లేకపోయినా వ్యవస్థ ప్రజల కోసం పని చేయాలని, వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ ఒక్కటి రెండు శాతాలు మాత్రమే ఉంటాయని అన్నారు.
మనం న్యాయం ప్రకారం విధులు నిర్వహిస్తే ప్రజల ముఖాలపై కనిపించే సంతోషం నుండి వచ్చే సంతృప్తి ఎక్కడా లభించిందని అన్నారు. శాంతి భద్రతలు సరిగా ఉంటేనే ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. వరదల సమయంలో కార్యాలయానికి పరిమితం కాకుండా పోలీస్ కమిషనర్ నేరుగా ప్రజలలో వెళ్లి పని చేశారని కలెక్టర్ తెలిపారు.
గత సంవత్సరం భారీ వరదల నేపథ్యంలో వరద సహాయక చర్యలు, సాధారణ పరిస్థితులను పునరావృతం చేయడం వంటి అంశాలలో ఉద్యోగులు సఫలీ కృతులయ్యారని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను విజయవంతంగా సకాలంలో పూర్తి చేయడం కారణంగా వరదల విపత్తుల నుంచి బయటపడ్డామని, భవిష్యత్తులో వరదలు వస్తే ఎలా ఎదుర్కోవాలో పక్కా ప్రణాళిక తయారు చేసుకున్నామని అన్నారు.
మహిళలు అన్ని ప్రాంతాలు, మతాలు, కులాల వారిగా గత కొన్ని దశాబ్దాలుగా వివక్షకు గురయ్యారని, దానిని నివారించేందుకు మహిళలను బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 50 శాతం జనాభాను విస్మరిస్తే అభివృద్ధి సాధ్యం కాదని, తన సొంత కుటుంబంలో కూడా మూడవా తరం అద్భుత స్థితిలో ఉందంటే కారణం ఒక మహిళ చదువుకోవడం మాత్రమేనని అన్నారు.
దేశం చాలా మారిందని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు బాధ్యత, పారదర్శకత పెరిగిందని, ప్రజలు నిరంతరం గమనిస్తూ మన పని తీరు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. మనం ఆశించే మార్పు మన నుంచే ప్రారంభం కావాలని అన్నారు.
బాల సదనంలో పిల్లలను మన పిల్లలుగా భావించాలని అన్నారు. అసమానతలను తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. నవ సమాజ నిర్మాణానికి పునాది సంక్షేమ శాఖ ద్వారా వేసే అవకాశం ఉంటుందని, బాల సదనం, అంగన్ వాడి కేంద్రాలకు చేసే పని చాలా సంతృప్తి కలిగించిందని అన్నారు.
మహిళా మార్ట్, స్త్రీ టీ స్టాల్, షీ రాక్స్ సెంటర్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల ల్యాబ్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, వరద సహాయక చర్యలు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన ఇలాంటి అనేక కార్యక్రమాలు విజయ వంతంగా ఖమ్మం జిల్లాలో అమలవు తున్నాయి అంటే దానికి కారణం ఇక్కడ చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు, సిబ్బంది ఉండటమేనని అన్నారు.
ఉద్యోగులు ప్రభుత్వ విధులను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతి రోజూ కొంత సమయం నడవాలని అన్నారు. ప్రతి ఉద్యోగి ప్రభుత్వ విధులతో పాటు తన కుటుంబానికి సమయం కేటాయించాలని అన్నారు.
మనకు ఒక పని ఉంటే అధికారులు ఏ విధంగా స్పందించాలని కోరుకుంటామో అదేవిధంగా మన కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మనం ప్రవర్తించాలని, ఈ అంశాన్ని ఉద్యోగులంతా గుర్తుంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ స్థాయిలో సేవలు అందించిన ఖమ్మం జిల్లా తనకు ఎప్పుడు ప్రత్యేకంగా నిలుస్తుందని, 12 నెలల కాలంలో తనకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ* ఖమ్మం అభివృద్ధి చెందేందుకు, జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా పని చేసేందుకు అధికారులను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసేందుకు పదవి విరమణ పోందుతున్న సిబ్బందిను సన్మానిస్తూ ప్రస్థానం కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు.
క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలెక్టర్ ఇంటారాక్ట్ అవుతూ వారికి ఏ అవసరాలు ఉన్నాయి, ప్రభుత్వం పరిధిలో వాటిని ఎలా నేరవేర్చాలి అనే కోణంలో చిత్తశుద్ధితో విధులు నిర్వహించారని అన్నారు.
స్నేహపూర్వక వాతావరణంలో సజావుగా గత 11 నెలల సమయం గడిచిందని, మహిళల అభ్యున్నతి, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా శాఖపై కలెక్టర్ తనదైన ముద్ర వేశారని అన్నారు.
అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమయంలో జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ఏవీ ను ప్రదర్శించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు వివిధ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, తహసిల్దార్ లు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, రెవెన్యూ డివిజన్ అధికారులు నర్సింహారావు, రాజేందర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి , జిల్లా అధికారులు, తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.






C.E.O
Cell – 9866017966
