*పేదలకు కేటాయించిన ఇండ్లస్థలాలు వారికే ఇవ్వాలి.
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్12*//: ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం, రఘునాథపాలెం సర్వే నెం. 218 నందు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను బై బ్యాక్ తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండ్ల స్థలాల బాధితుల తరుపున అఖిలపక్ష నాయకులు గురువారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, ఇతర నాయకులు మాట్లాడుతూ… రఘునాథపాలెం సర్వే నెం. 218 నందు 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఇండ్ల పట్టాలు ఇచ్చారని, తరువాత 2018 నందు తెలంగాణ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ పట్టాలను మార్చి తెలంగాణ ప్రభుత్వం పేరుతో 725 మందికి ఒక్కొక్కరికి 75 గజముల చొప్పున ఇండ్ల స్థలాన్ని కేటాయించి పట్టాలు ఇచ్చారని అన్నారు. అట్టి స్థలములలో ప్రభుత్వం వారు ఎటువంటి సౌకర్యములు కల్పించనప్పటికీ స్వంత ఖర్చులతో నీటి ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేసుకొని బేస్మెంట్లు నిర్మాణము చేసుకున్నారని అన్నారు. ఒక్కొక్క ఫ్లాట్ కు ఆ రోజులలోనే సుమారుగా 70 వేల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చు చేసి కట్టుకున్నారన్నారు. కానీ ఇటీవల కాలంలో నాగ్ పూర్ - అమరావతి నేషనల్ హైవే ఇదే ఫ్లాట్స్ మధ్య నుండి వెళుతుందని ఫ్లాట్స్ నందు సర్వే చేసినారు. అట్టి ఫ్లాట్లలో 261 ఫ్లాట్స్ రోడ్డు కి పోయాయని సర్వే చేసినారు. బాధితులు అందరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆర్డిఓ, రఘునాథపాలెం తహశీల్దార్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారందరికీ కలిసి ప్లాట్స్ నుండి రోడ్ అలైన్మెంట్ మార్చాలని విన్నవించుకున్నారన్నారు. అధికారులు రోడ్ క్రింద పోయిన ఫ్లాట్స్ వారికి కూడా న్యాయం చేస్తామని, తగిన నష్టపరిహారం ఇవ్వడం లేదా మరో చోట ఇండ్ల స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు కేటాయిస్తామని చెప్పారన్నారు. మిగిలిన ఫ్లాట్స్ నందు ఇండ్ల నిర్మాణము చేసుకొనుటకు ఎటువంటి ఆటంకము లేదని చెప్పినారు. తరువాత ఇండ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలలో యంగ్ ఇండియా స్కూల్ కి 30 ఎకరాల స్థల సేకరణలో భాగంగా మళ్ళీ ఇదే ప్లాట్స్ లో స్థలం కేటాయించారని అన్నారు. ఈ విషయం తెలుసుకొని బాధితులు అధికారులను వివరణ కోరగా మీకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు ప్రభుత్వం బై బ్యాక్ తీసుకుందని, అక్కడ ఎవ్వరికి ఇండ్ల స్థలాలు లేవని అంటున్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్ బాధితులకు ఇంటి నిర్మాణము చేసుకోండని చెప్పినా అనుమతి ఇవ్వకుండా అధికారులు ఆఫీసుల చుట్టూ త్రిప్పుచున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. చివరికి ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయ లోపం వలన 725 మంది కుటుంబాలు అంటే సుమారుగా 3 వేల మంది భవితవ్యం ప్రశ్నార్థకమైనదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్ కొరకు తీసుకున్నామని చెబుతున్న పేదల ఇండ్ల స్థలాలు వారికే కేటాయించాలని, అట్టి స్థలాలలో ఇండ్ల నిర్మాణము చేసుకొనుట కొరకు నీటి వసతి, రోడ్లు, కరెంట్ తదితర సదుపాయాలు కల్పించడమే కాకుండా ప్రతి ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని పార్టీలను కలుపుకొని అఖిల పక్షం ఆధ్వర్యంలో బాదితుల పక్షాన ఎటువంటి పోరాటానికైనా వెనుకాడబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, బిఆర్ఎస్, బిఎస్పి, సిపిఐ, సిపిఐ(ఎం.యల్. మాస్ లైన్), కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ తదితర పార్టీ ల నుండి నున్నా నాగేశ్వరరావు, పగడాల నాగరాజు, బుర్ర ఉపేంద్ర సాహు, మేకల శ్రీనివాస్, వై. విక్రమ్, ఆవుల మంగతాయారు, రాంబాబు, నవీన్ రెడ్డి, పల్లెపోగు విజయ్, బి. ఉపేందర్, మనోహర్, శ్రీధర్, శ్రీను, ప్రసాద్, గోపాలరావు, టి. ప్రవీణ్, షకీనా తదితరులు పాల్గొన్నారు.
