*పాఠశాలలో అధికంగా ఉన్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు కేటాయించాలి
**విద్యార్థుల సంఖ్య పెంచేలా పకడ్బందీగా బడి బాట కార్యక్రమం నిర్వహించాలి
**కలెక్టరేట్ లో అడల్ట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ పై సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్
జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే06//:అక్షరాస్యత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు.
మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విద్య, వయోజన విద్య లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ, నిరక్షరాస్యత తొలగించే దిశగా ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం రావాలని కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటీరసి ప్రోగ్రాం ను ప్రవేశపెట్టిందని అన్నారు. జిల్లాలో 50 వేలకు పైగా ఉన్న నిరక్షరాస్యులకు ఉల్లాస్ కార్యక్రమం అమలుకు లక్ష్యంగా నిర్దేశించిందని అన్నారు. మండలంలో ఉల్లాస్ కార్యక్రమంపై రివ్యూ నిర్వహించి వాలంటీర్లను గుర్తించాలని, ప్రతి వాలంటీర్ 5 నిరక్షరాస్యులకు అక్షరాస్యత నెర్పించేలా కార్యక్రమం అమలు చేయాలని అన్నారు. మహిళా సంఘాలు, పంచాయతీ కార్యదర్శులకు మరోసారి లక్ష్యాన్ని నిర్దేశించి నిరక్షరాస్యుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని అన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఎంత మంది ఉంటున్నారు, అవసరమైన సంఖ్యలో అందుబాటులో ఉన్నారా, లేదా పరిశీలించాలని, ఎక్కడా కూడా అనవసరంగా డిప్యూటేషన్ ఉండటానికి వీలు లేదని అన్నారు. మన సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కంటే గొప్ప వృత్తి మరొకటి లేదని, ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత దృష్టిలో ఉంచుకొని పని చేయాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్ణిత క్యాడర్ కంటే అధికంగా స్టాఫ్ ఉన్నట్లు భవిష్యత్తులో తెలిస్తే సంబంధిత హెడ్ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. పాఠశాలలో అధికంగా ఉన్న డిప్యుటేషన్ లను రద్దు చేసి ఖాళీగా ఉన్న పాఠశాలలకు పంపాలని అదనపు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూల్ యూనిఫాం బట్ట వచ్చిందని, మహిళా సంఘాల ద్వారా ఏకరూప దుస్తులు కుట్టి పాఠశాలలకు వస్తుందని, వీటి నాణ్యతను ముందుగా పరిశీలించాలని అన్నారు.
విద్యార్థులకు అవసరమైన మేర పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ వచ్చినవి అడిగి తెలుసుకున్నారు. జూన్ 2 వరకు ప్రతి విద్యార్థికి ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేయాలని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
బడి బాట కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. గ్రామాలలో ఎంత మంది పిల్లలు ఉన్నారు, ఏ పాఠశాలలో చదువుతున్నారు, మన పాఠశాలలో చదివే విధంగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని, బడి బాట కార్యక్రమం పక్కా కార్యాచరణ తయారు చేయాలని అన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయులు కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. బడి బాట ప్రారంభానికి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో సాధించిన విజయాల గురించి విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు.
మే 15 నాటికి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్ డేట్ చేయాలని, ఈ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న స్థలం ఆధారంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ న్యూట్రి గార్డెన్ ఏర్పాటు ప్రణాళిక తయారు చేయాలని, అవసరమైన మొక్కలను నర్సరీ నుంచి తెచ్చుకోవాలని అన్నారు.
పాఠశాలలో విద్యార్థులు ఉల్లాసంగా గడిపేందుకు అవసరమైన క్రీడా సామాగ్రి పరికరాలను కొనుగోలు చేయాలని, దీనికి అవసరమైన గ్రాంట్ ను ప్రతి పాఠశాలకు అందించామని అన్నారు. త్రాగు నీటి సరఫరా సమస్యలు, అదనపు తరగతి గదుల అవసరాలు ఉన్న పాఠశాల వివరాల ప్రతిపాదనలు అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, పాఠశాలల హెడ్మాస్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





C.E.O
Cell – 9866017966
