
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుపై వాడి వేడి చర్చ. లోక్సభలో ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ రాజ్యసభలో గురువారం (ఏప్రిల్ 2) చర్చ సందర్భంగా కూడా వాకౌట్ చేసింది. సభలో బిల్లుపై చర్చ జరుగుతుండగా వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభలో పక్ష నేత వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా పార్టీ వైఖరిని వైసీపీ స్పష్టం చేశారు. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా ఈ బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
రాజధాని మౌలిక సదుపాయాల కల్పన కోసమే దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనాలు చెబుతున్నాయని, ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.40 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని సమాచారం. ఈ ఆర్థిక భారాలను దృష్టిలో ఉంచుకునే తాము బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు.

C.E.O
Cell – 9866017966
.webp)
