
రాజస్థాన్ అంటేనే మనకు మొదట గుర్తుకు వచ్చేది ఇసుక తిన్నెలు, కోట్లు మరియు ఎడారి ప్రాంతం. అయితే, అదే ఎడారి రాష్ట్రంలో స్విట్జర్లాండ్‌ను తలపించేలా ఒక మంచు కొండల ప్రాంతం ఉందంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అజ్మీర్‌లో ఏర్పాటు చేసిన కిషన్‌గఢ్‌లో ఉన్న ‘మార్బుల్ డ్రంపింగ్ యార్డ్’ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తూ, ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందింది.
నిజానికి ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినది కాదు. కిషన్‌గఢ్ ప్రాంతంలో వందలాది మార్బుల్ కటింగ్ యూనిట్లు ఉన్నాయి. పాలరాతిని కట్ చేసే సమయంలో వెలువడే వ్యర్థ పదార్థాన్ని (మార్బుల్ స్లరీని) ఒకే చోట దశాబ్దాల తరబడి పేరుకుపోయేలా చేయడం వల్ల ఇక్కడ పెద్ద పెద్ద తెల్లని గుట్టలు ఏర్పడ్డాయి. ఈ వ్యర్థాలే కాలక్రమేణా గడ్డకట్టి, చూసేందుకు మంచు పర్వతాల వలె కనిపిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.
ఈ ప్రాంతం ఇప్పుడు కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా, సినీ పరిశ్రమకు ఇష్టమైన షూటింగ్ స్పాట్‌గా కూడా మారింది. ఇక్కడ ఉన్న తెల్లని పరిసరాలు, నీలి రంగులో మెరిసే కుంటలు మంచు దేశంలో ఉన్నామా అనే భ్రమను కలిగిస్తాయి. దీనితో పలు భాషల చిత్రాల పాటలు, వెడ్డింగ్ షూట్స్ మరియు ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి ఇది ప్రధాన వేదికగా నిలుస్తోంది. ఇక్కడ ఫోటోలు దిగితే అవి విదేశాల్లో దిగినట్లుగా కనిపిస్తున్న యువత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తున్నారు.
ఒకప్పుడు కేవలం వ్యర్థాల కుప్పగా భావించిన ఈ ప్రాంతం, ఇప్పుడు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తోంది. కిషన్‌గఢ్ మార్బుల్ అసోసియేషన్ దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో చొరవ చూపుతోంది. పర్యాటకులు ఇక్కడ సురక్షితంగా తిరగడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుందని, ఆ సమయంలో పర్యాటకుల రద్దీ రెట్టింపు అవుతుందని స్థానికులు చెబుతున్నారు.
భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత మెరుగైన సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. వ్యర్థాల నిర్వహణను ఒక కళాఖండంగా మార్చేందుకు కిషన్‌గఢ్ నిరూపించింది. రాజస్థాన్ పర్యటనకు వెళ్లే పర్యాటకులు ఇప్పుడు తమ జాబితాలో ఈ ‘మినీ స్విట్జర్లాండ్’ ను తప్పనిసరిగా చేర్చుకుంటున్నారు.

C.E.O
Cell – 9866017966

