
కడప జిల్లా అరటి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను సాకుగా చూపుతూ వ్యాపారులు అరటి ధరలను ఒక్కసారిగా భారీగా తగ్గించడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట కోతకు వచ్చిన వేళ, కనీసం అన్న పెట్టుబడి కూడా తిరిగి వస్తుందా లేదా అనిశ్చితిలో రైతులు మగ్గుతున్నారు.
జిల్లాలో ప్రధానంగా పులివెందుల, లింగాల, వేముల, సింహాద్రిపురం మండలాల్లో అరటి సాగు విస్తారంగా జరుగుతోంది. ఇక్కడ పండే అరటికి అరబ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఎగుమతులు నిలిచిపోయాయని చెబుతూ వ్యాపారులు ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
గత నెల వరకు టన్ను అరటి రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకు పలికింది. ప్రస్తుతం మొదటి క్రాప్‌కు కేవలం రూ.15 వేలు చెబుతుండగా, రెండో క్రాప్‌కు రూ.10 వేలకే కొనుగోలు చేయడానికి ట్రేడర్‌ల ఒత్తిడి ఉంది. అంటే ఒక్క నెలలోనే టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పడిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
అరటి సాగుకు ఎకరాకు దాదాపు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సాధారణంగా ఎకరాకు 15 నుంచి 20 టన్నులు దిగుబడి వస్తుందని రైతులు ఆశిస్తారు. కానీ ప్రస్తుత ధరలతో చూస్తే ఖర్చులు కూడా తిరిగి రావడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో ధరలు పెరుగుతాయని భావించిన రైతులకు వ్యాపారుల సిండికెట్ పెద్ద దెబ్బతీసింది.
పులివెందుల ప్రాంత అరటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇతర ప్రాంతాలలో పండే అరటి 7 నుంచి 8 రోజులు మాత్రమే నిల్వ ఉంటే, పులివెందుల అరటి మాత్రం సుమారు 14 రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇక్కడి చౌడు నేలల వల్ల వచ్చే రుచి నాణ్యత కారణంగా విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది.
ఇలాంటి నాణ్యమైన పంట పండించినా ధర విషయంలో రైతులకు న్యాయం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధాన్ని సాకుగా చూపి ధరలను తగ్గిస్తున్న దళారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించి, ఎగుమతులు నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్న జిల్లా అధికారులను అన్నదాతలు వేడుకుంటున్నారు.

C.E.O
Cell – 9866017966

