
హైదరాబాద్లోని హోటళ్లు, హాస్టళ్లను ప్రస్తుతం గ్యాస్ ట్రబుల్ వేధిస్తోంది. ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయో చూస్తే నగరంలోని హోటళ్లు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తెలంగాణలో మొత్తం 50 వేల హోటళ్లు ఉంటే, ఒక్క హైదరాబాద్ లోనే 20 వేల హోటళ్లు ఉన్నట్టుగా ఒక అంచనా. అయితే వీటిలో ఆరేడు వేల హోటళ్లు మూతపడేలా ఉన్నట్లు. ఇప్పటికే బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాల్లో హోటళ్లు సమ్మెకు దిగగా.. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఇక్కడా ఇలాంటి పరిస్థతి తప్పక పోవచ్చని అంటోంది. ఇప్పటి వరకూ తెలంగాణలో ఎప్పుడూ హోటళ్లు మూత పడలేదని చెబుతున్నారు వీరు.
కమర్షియల్ సిలిండర్ల సరఫరా 50 శాతం అయినా చేయకుంటే ఇక్కడి హోటళ్లను టెంపరరీ షట్ డౌన్ ప్రకటించక తప్పదంటోంది అసోసియేషన్. కొన్ని హోటళ్లు.. ఇప్పటికే తమ పని గంటలను తగ్గించుకున్నాయి. మెనూలోని ఐటెమ్స్ కూడా కట్ చేశాయి. గ్యాస్ ఎక్కువ తీసుకునే పూరీ, వడ వంటి ఐటెమ్స్ ని తీసేశాయి.
ఎందుకొచ్చిందీ పరిస్థితి అని చూస్తే అంతర్జాతీయ యుద్ధ వాతావరణమే ప్రధాన కారణంగా ఉన్నట్లు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. హోర్మూజన్ జలసంధి ద్వారా భారతదేశానికి వచ్చే 60 శాతం కంటే ఎక్కువ గ్యాస్ దిగుమతులు ఆగిపోయాయి. యుద్ధం వల్ల ఈ జలసంధి మూసుకుపోవడంతో గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్- ఈసీఏ కింద గృహ’ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ.. కమర్షియల్ సిలిండర్లపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం బ్లాకులో వీటి ధర సుమారు మూడు వేల వరకూ ఉంటుంది. ఇక అధికారకంగా కూడా గ్యాస్ సిలిండర్ల ధరలు బాగానే పెరిగాయి. సాధారణ సిలిండర్ పై అరవై, కమర్షియల్ సిలిండర్ ధర సుమారు నూటయాభై వరకూ పెరిగింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా 75 శాతం మేర తగ్గింది. ఈ కండీషన్లో హోటళ్లను నడపటం తమ వల్ల కాదంటోంది అసోసియేషన్.
హైదరాబాద్ సిటీలో 2.28 లక్షల స్ట్రీట్ వెండర్స్, చిన్న హోటళ్ల వాళ్లున్నారు. హోటల్ ఇండస్ట్రీని బేస్ చేసుకుని 10 లక్షల మంది వరకూ ఆధారపడి జీవిస్తున్నారు. ఇక విద్యార్ధులు, ఉద్యోగులు, బ్యాచిలర్లు, ప్రయాణికుల ఆహార అవసరాలు తీర్చుతున్నది ఈ హోటళ్లే. ఒక వేళ ఈ హోటళ్లుగానీ మూతబడితే.. ఆహార సేవా కేంద్రాలుగా ఉన్న వీటి సేవలకు తీవ్ర అంతరయం ఏర్పడుతుంది. కాబట్టి.. పరిస్థితి అర్ధం చేసుకోవలసిందిగా మనవి అంటూ ఇది వరకే పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ ని కలసి వినతి పత్రం తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఇచ్చారు.
వీరి డిమాండ్లు ఎలాంటివో చూస్తే.. హోటల్ పరిశ్రమ కూడా ఎసెన్షియల్ సర్వీస్ గానే తీసుకోవాలి. నిరంతర గ్యాస్ సరఫరా చేయాలి, గ్యాస్ సరఫరా పునరుద్దరించే వరకూ ఎలక్ట్రిక్ కుకింగ్ పై రాయితీలు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకుని.. ఆయిల్ కంపెనీలతో మాట్లాడి నిల్వలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కడో యుద్ధం జరిగితే అది మన వంటింటిని, హోటల్ ని తాకడం చూస్తుంటే.. ఇది కదా వసుదైక కుటుంబకం అంటే అన్న మాట వినిపిస్తోంది. అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలని కొందరు పదే పదే ఇందుకే కోరుకుంటున్నారా? అనిపిస్తోంది. హోటల్ పరిశ్రమ ఎందరికో జీవనోపాధి. కాబట్టి ఇలా అనాలనిపించడం సహజం కూడా.

C.E.O
Cell – 9866017966

