
చీరకట్టులో ఇద్దరు మహిళలు స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. నేటి జమానాలో మహిళలు ఉద్యోగవ్యాపార రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మహిళలు దుస్తులను ఎంచుకుంటున్నారు. పని ప్రదేశాల్లో వారికి అనుకూలంగా ఉండే వస్త్రధారణ వైపు మొగ్గు చూపుతున్నారు. చీరలు, ఇతర సంప్రదాయ వస్త్రాలను పండుగలు, లేదా ప్రత్యేక సందర్భాలలోనే ధరిస్తారు. ఈ నేపథ్యంలో చీరలు ధరించిన ఇద్దరు మహిళలు ఏకంగా స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఓ భారతీయురాలు మరో విదేశీ మహిళతో కలిసి చేసిన ఈ సాహనం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, చీరలు కట్టుకున్న ఇద్దరు మహిళ స్నోబోర్డింగ్ చేశారు. స్నో బోర్డు సాయంతో మంచు పర్వతంపై నుంచి కిందకు దూసుకెళుతూ అబ్బురపరిచే రీతిలో విన్యాసాలు చేశారు. చీరలు ధరించిన వారు ఇలాంటి సాహస క్రీడల్లో కూడా పాల్గొనేందుకు రుజువు చేశారు. ఇక ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
సంప్రదాయక వస్త్రధారణను ఇష్టపడే మహిళలందరి ముఖాల్లో ఈ వీడియో నవ్వులు పూయిస్తుంది. ఆధునికతకు సంప్రదాయకతను అద్భుతంగా జోడించి వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారని మరికొందరు ప్రశ్నించారు. కొందరు హెల్మెట్ పెట్టుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసక్రీడల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని హితవు పలికారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ వీడియోకు మాత్రం జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.

C.E.O
Cell – 9866017966

